తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో సాయంత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే నిన్న సాయంత్రం రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అల్వాల్, కోటి, ఆబిడ్స్, లక్డీకాపూల్, అసెంబ్లీ, అమీర్‌పేట, యూసఫ్‌గూడా, మధురానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, నార్సింగి ప్రాంతాల్లో రెండు నుంచి మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరడంతో ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో మున్సిపల్, హైడ్రా అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీర్ఘకాలంగా వర్షాలు లేక ఎండలతో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com