ఫలితాలకు ముందే జనసేన MPTC అభ్యర్థి మృతి.. ఆమెకు 350 ఓట్ల మెజారిటీతో విజయం
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం MPTC స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య శనివారం విడుదలైన ఫలితాల్లో 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు రాకముందే ఆమె శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.
గురువారం పోలింగ్ జరిగింది. ఓటు వేసిన కొన్ని గంటలకే దివ్య అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను దేవరపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. ఆరోగ్యం కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు.
శుక్రవారం ఉదయం మళ్లీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
దివ్య డిగ్రీ పూర్తి చేశారు. శ్రీనివాస్‌తో ఆమె ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న దివ్య, గెలుపు ఆనందం పంచుకోకుండానే కన్నుమూశారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com