కామారెడ్డి: మాచారెడ్డి సొసైటీ అధికారుల చేతివాటంతో యూరియా మాయం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీ అధికారులు యూరియా పంపిణీలో చేతివాటం చూపిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సొసైటీ పరిధిలోని 25 మంది రైతులు ఈ నెల 28వ తేదీన ఆన్లైన్ లో 444 బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. అయితే సొసైటీ దగ్గరకు వెళ్ళిన తర్వాత యూరియా ఇప్పటికే సరఫరా చేశామని అధికారులు చెప్పారు. రైతులకు చెందిన సుమారు 120 బస్తాల యూరియా మాయమైంది.
రైతులు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న యూరియాను తమ సెల్ ఫోన్ నంబర్ కు OTP రాకుండా ఎవరికి ఇచ్చారని రైతులు సొసైటీ అధికారులను నిలదీశారు. దీనికి సమాధానం ఇవ్వకుండా అధికారులు రైతులపై మండిపడ్డారు. సొసైటీ అధికారులు కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మండల AO పవన్ కుమార్ జోక్యం చేసుకున్నారు. నిర్వాహకుల లోపం వల్లనే ఇలా జరిగి ఉంటుందని, ఆన్లైన్ వ్యవస్థలో ఎలాంటి సమస్య ఉండదని రైతులకు నచ్చచెప్పారు. అయినప్పటికీ రైతులు సంతృప్తి చెందలేదు. యూరియా మాయం పట్ల సొసైటీ అధికారులపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com