కోనసీమలో నదీ కోత.. కొబ్బరి తోటలు, వ్యవసాయ భూములు నదిలో కలిసిపోతున్నాయి
కోనసీమలో గోదావరి నదీ కోత తీవ్రమవుతోంది. రెండు తుఫాన్ల ప్రభావంతో ఈ ప్రాంతం మరింత దెబ్బతింది. వైనతేయ నది ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్లను వేళ్లతో సహా పెకిలించుకుపోతోంది. వ్యవసాయ భూములు రోజుకో కొంత నదిలో కలిసిపోతున్నాయి.
రాజోలు, అప్పనపల్లి, పాసర్లపూడి, బి.దొడ్డవరం, లూటుకుర్రు తదితర లంక గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఖరీదైన కొబ్బరి తోటలు గోదావరి నదిలో కలిసిపోతుండడంతో తీరప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే తోటలు, సస్యశ్యామలమైన భూములు నశించడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
వైనతేయ నది పరివాహక ప్రాంతంలో ఒకేసారి ఐదారు చోట్ల పెద్ద ఎత్తున కోత జరిగింది. దీనివల్ల పెదపం నుంచి అప్పనపల్లి వరకు వెళ్లే మార్గం దెబ్బతింది. రాజోలు దీవిలో ఒక వైపు సముద్రం, మూడు వైపులా గోదావరి ఉంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి లంక భూములను ముంచెత్తుతోంది.
నదీ కోతను అరికట్టాలని రైతులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ లక్ష్యంతో పోరాటాలు కూడా చేసినట్టు వారు చెప్తున్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు భయాందోళనలో ఉన్నారు.
నదీ కోతకు తక్షణ పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com