హైదరాబాద్ 27°C
అమరావతి 27°C
IST 3:16 PM
బుధవారం అక్టోబర్ 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం బ్రేకింగ్

మచిలీపట్నంలో ఈదురుగాలుల ప్రభావం: చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
మచిలీపట్నంలో ఈదురుగాలుల ప్రభావం: చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం
📷 Nathan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని రహదారులపై రెండు అడుగులకు పైగా నీరు నిలిచింది. ఎస్పీ కార్యాలయం, ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్, కలెక్టర్ బంగ్లా, లక్ష్మీ టాకీస్ సెంటర్, కోనేరు సెంటర్, జడ్పీ సెంటర్, ఎనుకుదురుపేట, రాబర్ట్సన్‌పేట ప్రాంతాల్లో నీరు చేరింది.

మచిలీపట్నంలో 12 గంటలు దాటినా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. విద్యుత్ నిలిచిపోవడంతో సెల్ టవర్లు పని చేయడం లేదు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. సముద్రం తీరం వైపు ఎగిసిపడుతోంది. సముద్రం దాదాపు 1500 మీటర్ల మేర ముందుకు వచ్చినట్టు సమాచారం. సముద్ర తీరానికి ప్రజలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పంటలకు భారీ నష్టం జరిగింది. కోతకు వచ్చిన వరి, చెరకు, అరటి, పసుపు, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం జరిగింది. పలు చోట్ల పశువులు, జంతువులు మృతి చెందినట్టు సమాచారం. ప్రాణ నష్టం జరిగినట్టు ఇప్పటివరకు సమాచారం లేదు.

నాగాయలంక, పాలకాయతిప్ప, కోడూరు, చల్లపల్లి, కృతివెన్ను, చినగొల్లపాలెం తదితర తీర ప్రాంతాల్లో లోతట్టు, లంక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 167 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

రాబోయే 24 గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించింది. చెట్లు, హోర్డింగ్‌ల కింద ఉండవద్దని కూడా హెచ్చరించింది.

నష్టం అంచనాలు వేసేందుకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రెవెన్యూ, ఆర్ఎన్బీ సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com