సింగపూర్ అధ్యయన యాత్ర చేసిన టీచర్లతో మంత్రి లోకేష్ సమావేశం
విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పు తేవటం వెంటనే సాధ్యం కాదని, అందుకు కొంత సమయం పడుతుందని విద్యా మరియు IT శాఖల మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థలో అన్ని సమస్యలను ఒకే రోజు పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రాధాన్య క్రమంలో అన్నిటిని పరిష్కరిస్తామని వెల్లడించారు.
విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటి అమలుకు గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు.
జీవితకాల అభ్యసనకు సింగపూర్ విద్యా విధానం ఎంతో ఉపయుక్తమని ఉపాధ్యాయులు మంత్రికి తెలిపారు. సత్ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో విద్యా శాఖది కీలక పాత్ర అని ఆయన అన్నారు.
విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్లు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అక్కడ నేర్చుకున్న వాటిని సహ టీచర్లకు నేర్పాలని కోరారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటామని లోకేష్ తెలిపారు.
సింగపూర్‌లో కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుందని ఉపాధ్యాయులు లోకేష్‌కు తెలిపారు. అక్కడ ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, అసైన్మెంట్లు, కంటెంట్ ఎలా తయారు చేస్తున్నారో, ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేశామని చెప్పారు. ఆ విద్యా విధానంతో విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ మరియు సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.
ప్రాథమిక స్థాయి నుంచే వృత్తి విద్య, నైపుణ్య అభివృద్ధికి సింగపూర్‌లో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఉపాధ్యాయులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సెకండరీ స్కూల్‌ను స్థానికంగా ఉండే పరిశ్రమలకు అనుసంధానించి విద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారని, దీంతో చదువు పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
సింగపూర్‌లో పాఠశాల నిర్వహణ విధానం బాగుందని, ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్లు జట్టుగా పని చేస్తున్నారని గురువులు వెల్లడించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేస్తారని, విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.
సింగపూర్‌లో ప్రీ సర్వీస్ టీచర్ శిక్షణ చాలా బాగుందని, టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులు 18 నెలల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. సింగపూర్‌లో టీచ్ లెస్ లెర్న్ మోర్ విధానం బాగుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com