అమలు కాని హామీలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని PNG కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సభలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తుందని ఆమె ఆరోపించారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిసర ప్రాంత రైతులకు ఇప్పటికే ఐదుసార్లు రైతు బంధు అందించాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండుసార్లు మాత్రమే అందించిందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర కంటే రూ.500 అధికంగా బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తన వైఖరి మార్చుకుందని ఆమె విమర్శించారు.
ముందు అన్ని పంటలు కొంటామని చెప్పి తర్వాత వడ్లు మాత్రమే కొంటామని, అనంతరం సన్న వడ్లు మాత్రమే కొంటామని వెనక్కి తగ్గారని ఆమె ఆరోపించారు. అది కూడా అరకొరగా కొని హామీ ఇచ్చిన బోనస్ కూడా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ కాలేదని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులన్నీ రైతులు గమనిస్తున్నారని, అన్నదాత సహనం ఎక్కువగా ఉంటుందని, కానీ వారిని తక్కువగా అంచనా వేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com