ముంబైలో భారీ వర్షాలు: 5 విమానాలు దారి మళ్లింపు, రైళ్లు ఆలస్యం, రెడ్ అలర్ట్
ఋతుపవనాల ప్రభావంతో ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 12 గంటల్లో పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల చెట్లు, ఇళ్లు కూలాయి. రోడ్లు పూర్తిగా జలమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలపైకి నీరు చేరడంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముంబై ఎయిర్పోర్టులో ఇండిగో, ఎయిర్ ఇండియాలకు చెందిన ఐదు విమానాలను దారి మళ్లించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ ముంబైతో పాటు పరిసర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో అత్యంత భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. సముద్రంలో 4.26 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. జూన్ 30న ముంబైలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏండ్ల బాలుడు మృతి చెందాడు. సాకినాక ప్రాంతంలో తెరిచిన మ్యాన్హోల్లో పడి 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూణేలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వదిలిన డ్రైనేజ్ గుంతలో పడి రెండేండ్ల చిన్నారి మరణించింది. థానేలో నిలిచిన నీటిలో జారిపడిన మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ముంబై, పూణే, నాసిక్ ప్రాంతాల ప్రజలు రేపటివరకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎస్ఎంఎస్ ద్వారా ప్రతి మూడు గంటలకు వాతావరణ హెచ్చరికలు పంపుతోందని, వాటిని పాటించాలని కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com