ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను కడపలో గుర్తించారు; ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు
వైయస్సార్ కడప జిల్లాలో నమోదైన కోవిడ్-19 నమూనాల్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్‌ను నిపుణులు గుర్తించారు. ఈ నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఆర్ఎఫ్.5 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల నివేదిక శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు అందినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో డీఎంఈ డాక్టర్ ఏ. విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్ఎఫ్.5ని సాధారణ వేరియంట్‌గా వర్గీకరించిందని, ఇది ప్రమాదకరమైనదని చెప్పడానికి ఆధారాలు లేవని వివరించారు. సింగపూర్ మరియు ఆగ్నేయాసియా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదయినప్పటికీ, ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే దీని తీవ్రత ఎక్కువగా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎఫ్.5 వైరస్ సోకితే గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందొద్దు, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో శనివారం నాటికి కోవిడ్-19 కేసుల సంఖ్య 16కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com