హైదరాబాద్ 30°C
అమరావతి 31°C
IST 10:49 AM
మంగళవారం సెప్టెంబర్ 22 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా.

ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) రైతులకు పంటల సాగు సూచనలు విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు కంది, ఆముదం, పొద్దు తిరుగుడు, తక్కువ కాల పరిమితి గల కూరగాయలను సాగు చేయవచ్చు. ఆగస్టు 16 నుంచి 31 వరకు నువ్వుల పంట విత్తుకోవచ్చునని సూచించింది.

భారీ వర్షాలు కురిసిన పొలాల్లో మురుగు నీటిని తీసివేయాలి. ఆరుతడి పంటలలో సిఫారసు చేసిన ఎరువులను మొత్తం పొలంలో చల్లకుండా మొక్కలకు దగ్గరగా వేసి మట్టితో కప్పాలి. పట్టణ శివారు రైతులు పరిమిత నీటితో కూరగాయలు పండించవచ్చు.

వర్షాధారిత ప్రత్తి పంటలో 20 నుంచి 40 రోజుల దశలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 25 కేజీల నత్రజని, 10 కేజీల పొటాషియం ఎరువులు పైపాటుగా వేయాలి. ప్రస్తుత పరిస్థితులు రసం పీల్చే పురుగులకు అనుకూలమని, నివారణకు ఎకరాకు పసుపు, తెలుపు, నీలం జిగురు అట్టలు పది చొప్పున ఏర్పాటు చేయాలి. కాండానికి మందు పూసే పద్ధతిలో 30, 45 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ మందును వాడాలి.

వర్షాధారిత మొక్కజొన్నలో 30 రోజుల వయసులో ఎకరాకు 50 కేజీల యూరియా వేయాలి. కత్తెర పురుగు నివారణకు 14 రోజుల పంటపై వేప నూనె పిచికారీ చేయాలి. పురుగు కనిపిస్తే క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లేదా స్పైనటోరం 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి ఆకు సుడుల్లో పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఒక కేజీ సున్నం, 9 కేజీల ఇసుక మిశ్రమాన్ని సుడుల్లో వేయాలి.

పశువుల విషయంలో మబ్బు వాతావరణంతో నీటిని ఎక్కువగా తాగుతాయి కాబట్టి తగినంత నీరు అందుబాటులో ఉంచాలి. కోళ్లలో రాణీఖేత్ వ్యాధి నివారణకు, గొర్రెల్లో పీపీఆర్, గొంతువాపు వ్యాధులకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలని విశ్వవిద్యాలయం సూచించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com