ఆంధ్రప్రదేశ్

పోలవరం వద్ద గోదావరికి వరద; 48 గేట్లు ఎత్తి నీటి విడుదల, తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పోలవరం వద్ద గోదావరికి వరద; 48 గేట్లు ఎత్తి నీటి విడుదల, తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది
📷 112 Uttar Pradesh / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరుకుంది. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.80 మీటర్ల నీటిమట్టం నమోదయింది. వరద ఉద్ధృతి పెరగడంతో స్పిల్వేలోని 48 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్ ఛానల్ నుంచి నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది.

ప్రాజెక్టు పనుల రవాణా కోసం వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి గండి పడింది. అదే మార్గంలో ఏర్పాటు చేసిన ఐరన్ పైపులు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పోలవరం ప్రాజెక్టు దిగువ ప్రాంతాలకు వెళ్లే లారీలు సాధారణంగా ఈ మార్గాన్నే ఉపయోగిస్తాయి.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి విషయానికి వస్తే, డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. ఎర్త్-కం-రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. డీ-వాటరింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కేంద్రం నుంచి దశలవారీగా నిధులు విడుదల అవుతున్నాయి. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

అయితే, వరదల నేపథ్యంలో నిర్వాసితులు మరోసారి ముంపు భయంతో ఆందోళన చెందుతున్నారు. నిర్వాసితులకు ఏడు మండలాల్లో పునరావాస కాలనీలు పూర్తిస్థాయిలో నిర్మించలేదు. వారికి ఇవ్వాల్సిన పరిహారం కూడా విడతలవారీగా ఇస్తున్నప్పటికీ, తొలిదశ వారికే పూర్తి చెల్లింపులు జరగలేదు. పరిహారం పూర్తిచేసి త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com