రేపు ఖమ్మం జిల్లా మధిరలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగే రైతు ఆశీర్వాద సభలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నిధులు తొలి విడతలో ఏకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే జమ చేస్తారా, లేదా అర్హులైన రైతులందరికీ ఒకేసారి విడుదల చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఈ అస్పష్టతతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ పథకం కోసం 9,000 కోట్లు కేటాయించింది. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం రహదారులు, గుంతలు వంటి సాగుకాని భూములకు రైతుభరోసా ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం సాగు భూములకు మాత్రమే ఇస్తుందని ప్రకటించింది.
గత యాసంగి సీజన్లో రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా నిధులు ఇవ్వడంతో మిగతా రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఏడు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఒకే విడతలో నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు జూలై 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. బ్యాంకు లేదా సాంకేతిక సమస్యలతో నిధులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున, రైతులు తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com