సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు: SIT దర్యాప్తులో కీలక పరిణామాలు, అజ్ఞాతంలో ఉన్న కానిస్టేబుళ్ళు లొంగిపోయారు
విజయవాడకు చెందిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో SIT దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇన్నాళ్ళూ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అశోక్, జంగం నాని సౌత్ జోన్ ASP ఆఫీస్ లో లొంగిపోయారు. అశోక్ CI నాగరాజుకు అసిస్టెంట్ గా పని చేయగా, జంగం నాని హెడ్ కానిస్టేబుల్ గా పని చేశారు. సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ఈ ఇద్దరిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబూరావుని SIT అధికారులు అదుపులోకి తీసుకున్నారు. CI నాగరాజు మిత్రుడు సురేష్ స్టేట్మెంట్ కూడా SIT అధికారులు రికార్డ్ చేశారు. ఇంటి భోజనానికి అనుమతించాలని నాగరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు అంగీకారం తెలిపింది. నాగరాజు ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నాగరాజును కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను జూలై ఒకటవ తేదీకి సెకండ్ ASM కోర్టు వాయిదా వేసింది. CI నాగరాజు తరపు న్యాయవాదిని కౌంటర్ దాఖల్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది. లాకప్ డెత్ పై CBI తో విచారణ జరిపించాలంటూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను కోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది.
రాజకీయంగా చూస్తే, సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని పవన్ కళ్యాణ్ చెప్పారని కూడా ఆయన తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు SIT చీఫ్ కి లేఖ రాశారు. మృతదేహాన్ని తరళించింది ఎవరు, CC ఫుటేజ్ మాయం చేసింది ఎవరు అని ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ కేసులో పై స్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని, క్రిమినల్ లయబిలిటీని CI కే పరిమితం చేయడం సరికాదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com