హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 11:53 AM
శనివారం జూలై 25 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

ధరణి పోర్టల్ అక్రమాలు: సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ధరణి పోర్టల్ అక్రమాలు: సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ప్రభుత్వం ధరణి భూ పోర్టల్ ఏర్పాటు, నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈ కమిటీకి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ను ప్రభుత్వం జారీ చేసింది.

అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. కమిటీలో ముగ్గురు IPS అధికారులు, ముగ్గురు IAS అధికారులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) కు చెందిన సాంకేతిక నిపుణుడు సభ్యులుగా ఉన్నారు.

2020 అక్టోబర్ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్ రూపకల్పన, టెండర్ ప్రక్రియ, బిడ్ల దాఖలు, నిర్వహణదారుడి ఎంపిక, పోర్టల్ లోపల మరియు వెలుపల జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను ఈ కమిటీ విచారిస్తుంది. అప్పట్లో టెండర్ ను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS) నిర్వహించింది. ఎంపికైన సంస్థపై దివాలా ఆరోపణలు, పెట్టుబడులు ఆర్బీఐ, సెబీ వద్ద నమోదు కాకపోవడం వంటి అంశాలను కూడా విచారించనున్నారు.

పోర్టల్ భద్రతకు భంగం కలిగించడం, భూయాజమాన్య హక్కులకు నష్టం, రుసుము చెల్లింపుల్లో లోపాలు, ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం జమ కాకపోవడం, అనధికార లావాదేవీలు, ఆడిటింగ్ లేకపోవడం వంటి అంశాలపై విచారణ జరుగుతుంది. కమిటీకి అవసరమైన సహకారం అందించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. అంతేకాకుండా, ఫారెన్సిక్, టెక్నికల్ ఏజెన్సీల సహాయం తీసుకునే అధికారం, నిపుణులను నియమించుకునే హక్కు కమిటీకి కల్పించింది.

విచారణ ముగిసిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిఫారసు చేస్తుంది. కమిటీ ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు అందించాలని, పోర్టల్ భద్రతకు సంబంధించి సూచనలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com