పాత ఆటోల స్క్రాపింగ్: ఫిట్నెస్ లేకపోయినా పర్మిట్ బదిలీకి తెలంగాణ రవాణా శాఖ అనుమతి
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో నడిచే పాత ఎల్పీజీ, సీఎన్జీ ఆటో రిక్షాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాలు తీసుకోవాలనుకునే యజమానులకు తెలంగాణ రవాణా శాఖ ఊరట కల్పించింది. స్క్రాప్ కు ఉద్దేశించిన పాత ఆటోకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (FC) రెన్యూవల్ లేకపోయినా పర్మిట్ బదిలీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం, స్క్రాప్ చేసే పాత వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ చెల్లుబాటులో లేకున్నా, యాజమాని నుంచి కొత్త యజమానికి పర్మిట్ బదిలీ చేసుకోవచ్చు. అయితే, కొత్త యజమాని ఆ పాత వాహనాన్ని రోడ్డుపై నడపబోమని, బదిలీ తేదీ నుంచి మూడు నెలల్లోపు తప్పకుండా స్క్రాప్ చేస్తానని లిఖిత పూర్వక హామీ (Undertaking) ఇవ్వాల్సి ఉంటుందని రవాణా శాఖ తెలిపింది.
నిర్ణీత గడువులోగా వాహనం నిజంగానే స్క్రాప్ అయిందో లేదో సంబంధిత రవాణా అధికారులు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు CFSS సాఫ్ట్ వేర్ నిబంధనల ప్రకారం, పర్మిట్ బదిలీకి ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. స్క్రాప్ అయ్యే వాహనానికి ఫిట్నెస్ పునరుద్ధరణ కోసం అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో, కొత్త విధానం ప్రకటించారు.
పాత ఆటోల స్థానంలో ఎల్పీజీ, సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలనుకునే యజమానులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుందని రవాణా శాఖ పేర్కొంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే పర్మిట్ బదిలీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, కాలుష్య నియంత్రణకు దోహదం చేసే స్వచ్ఛమైన ఇంధన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ మేరకు CFSS సాఫ్ట్ వేర్ లో అవసరమైన మార్పులు చేయాలని ఐటీ విభాగాన్ని ఆదేశించగా, హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు వెంటనే దరఖాస్తులు ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com