ధరణి పోర్టల్‌పై సమగ్ర విచారణకు SIT ఏర్పాటు: తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్త బృందం (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ నుంచి విడుదలైన జీవో 173 ప్రకారం, సీఐడీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఈ SIT కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
ఈ బృందంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, టీజీసీఎస్బీ ఎస్పీ హర్షవర్ధన్, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరందు, ఎన్ఐసీ సాంకేతిక నిపుణుడు సభ్యులుగా ఉన్నారు. సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ అపూర్వ చౌహాన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి టెండర్ ప్రక్రియ, విక్రేత ఎంపిక, పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ చేయనున్నారు. కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థపై చట్టపరమైన కేసులు ఉన్నాయా, వ్యక్తిగత భూమి సమాచారానికి భద్రతా ముప్పు ఏర్పడిందా, అనధికార లావాదేవీలు జరిగాయా అనే విషయాలు పరిశీలిస్తారు. సిస్టం లాగులు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్రస్లు నమోదు కాకపోవడం వంటి సాంకేతిక లోపాలనూ దర్యాప్తు చేస్తారు.
అక్రమాలకు బాధ్యులైన వ్యక్తులు, సంస్థలను గుర్తించి అవసరమైతే ప్రత్యేక దర్యాప్త సంస్థలకు కేసులు అప్పగించాలని ప్రభుత్వం SIT ను ఆదేశించింది. ఫోరెన్సిక్, సాంకేతిక నిపుణుల సేవలు కూడా వినియోగించుకోవచ్చు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని, ముఖ్యంగా డేటా భద్రతకు సంబంధించి మధ్యంతర నివేదికలు ఇవ్వాలని సూచించింది.
ఈ విచారణకు అన్ని ప్రభుత్వ శాఖలు, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ అధికారులు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com