ఉదయం 6 గంటలకే మోదీకి కాల్ చేయమన్న ట్రంప్.. నాలాగే నిద్రపోడని వ్యాఖ్య, రాయబారి వెల్లడి
మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగత స్నేహం ఎంత లోతైనదో తెలిపే ఆసక్తికర సంఘటనను భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పంచుకున్నారు. మయామిలో జరిగిన UFC ఈవెంట్ సందర్భంగా తనతో ట్రంప్ 'మోదీకి ఫోన్ చేద్దాం' అనగా, 'ఇప్పుడు భారత్‌లో ఉదయం 6 గంటలు' అని చెప్పానని, దానికి ట్రంప్ 'ఆయన మేల్కొనే ఉంటారు, నాలాగే నిద్రపోడు' అని సమాధానమిచ్చారని గార్సెట్టి తెలిపారు.
ఆ సమయంలో ప్రధానికి కాల్ కనెక్ట్ కాలేదని, ట్రంప్ స్టేజ్ మీదకు వెళ్లిపోవడంతో మరుసటి రోజుకు ఆ కాల్ షెడ్యూల్ చేశామని ఆయన వివరించారు. అయితే ఈ ఘటనలోని ముఖ్యమైన అంశం ట్రంప్‌కు మోదీతో ఉన్న స్నేహమేనని గార్సెట్టి పేర్కొన్నారు. 'స్నేహితుల మధ్య ప్రతీ విషయాన్ని ముందే షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ ప్రధానిని నిజమైన స్నేహితుడిగా భావిస్తారు. ఎవరితోనైనా స్నేహం ఉంటే, ఫోన్ ఎత్తి ఎలా ఉన్నారని అడుగుతారు. ప్రపంచంలోని ప్రతీ నేతకు ఈ స్థాయి సాన్నిహిత్యం లభించదు' అని ఆయన వివరించారు.
2019లో హూస్టన్‌లో 'హౌడీ మోదీ' కార్యక్రమం, 2020లో అహ్మదాబాద్‌లో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం ఈ స్నేహాన్ని ప్రపంచానికి చూపించాయి. ట్రంప్ తన తొలి టర్మ్‌లో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన సంగతి తెలిసిందే. ఈ స్నేహం వల్ల అమెరికా రాయబారిగా తనకు ఎంతో ప్రయోజనం ఉందని గార్సెట్టి చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com