కాళేశ్వరం బ్యారేజ్ల నిర్వహణపై కేంద్రానికి సమగ్ర నివేదిక పంపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల బ్యారేజ్ల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. నీటి నిలువ పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అనేది అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫారసుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్రానికి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. నీటి నిల్వ, పంపింగ్, భద్రత విషయాలపై నిపుణుల సలహా తర్వాతే ఎలాంటి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ బ్యారేజ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ (NDSC) ఇటీవల ఇచ్చిన వివరణలో, భద్రతా సూచనలు ఇవ్వడమే తమ బాధ్యత అని, పంపింగ్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటి పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి, చెరువులు ఎండిపోవడంతో రైతులు కాళేశ్వరం నుంచి నీటి సరఫరా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సాంకేతిక నిపుణులతో ఒక ట్రయల్ పంపింగ్ నిర్వహించి, ఎలాంటి ఇబ్బందులు లేకుంటే నీటి విడుదల చేపట్టాలన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రం స్పందన, సాంకేతిక సిఫారసుల తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com