కరీంనగర్ జిల్లా వెలిచాలలో గ్రామస్తుల సమిష్టి కృషితో రెండు చెరువుల పునరుద్ధరణ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామస్థులు సమిష్టి కృషితో రెండు చెరువులను పునరుద్ధరించారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో, చెరువులోని నల్లమట్టి విక్రయించి వచ్చిన ఆదాయంతో రెండు ప్రొక్లెయిన్లను అద్దెకు తీసుకున్నారు. దాదాపు 200 ఎకరాల్లో విస్తరించిన పాల సముద్రం ప్రాంతంలో చెట్లను తొలగించారు. 2 కిలోమీటర్ల మేర చెరువు కట్టలపై పెరిగిన తుమ్మ చెట్లను కూడా తీసివేశారు. చెరువుల్లోకి ప్రవహించే వరద కాలువ 4 కిలోమీటర్ల పొడవున, చిన్న చెరువు దిగువనున్న ఒర్రెను శుభ్రం చేశారు. కట్ట మరమ్మత్తు పనులు చేపట్టారు.
రామడుగు మండలంలో శాశ్వత సాగునీటి సదుపాయం లేదు. గాయత్రి పంప్ హౌస్, కాకతీయ కాలువ, ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు ఉన్నా నేరుగా పంటలకు నీరందించేవి కావు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల పెంపు కోసమే చెరువుల పునరుద్ధరణకు గ్రామస్తులు ముందుకు వచ్చారు.
సర్పంచ్ నరసింహరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో చెరువు మట్టి అమ్మగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని పూర్తిగా చెరువుల అభివృద్ధికే ఖర్చు చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందని తెలిపారు. ఈ రెండు చెరువులతో పాటు వాటికి అనుసంధానమైన మరో ఏడు గుంటలు తాగునీరు, సాగునీరు, పశువులకు, పక్షులకు జీవనాధారంగా ఉన్నాయన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com