అక్రమ ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ అరెస్ట్
హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌తో సహా 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి.
ఈ తనిఖీల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 9.24 కోట్ల రూపాయల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే వాటి మార్కెట్ విలువ 50 కోట్లకు పైగా ఉంటుందని ఏసిబి అంచనా వేసింది. నార్సింగి, నానకరామగూడ, సుమధుర, వాసవి ప్రాజెక్టుల్లో రవీందర్ పేరిట నివాస ప్లాట్లతో పాటు కొండకల్, కిస్తాపూర్, పసుమలలో ఐదు ఖాళీ స్థలాలు గుర్తించారు.
శంషాబాద్, షాబాద్, కొత్తూరు ప్రాంతాల్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, శంకరపల్లి మోకలలో లగ్జరీ విల్లా, కొండాపూర్ మసీద్ బండాలో జిప్లస్ఫోర్ భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రవీందర్ నివాసంలో నగదు, బ్యాంక్ ఖాతాల్లో 45 లక్షల రూపాయల డిపాజిట్లు, నాలుగు బ్యాంక్ లాకర్లు కనుగొన్నారు. దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి, 10 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇంట్లో నిల్వ ఉంచిన 18 విదేశీ లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశారు.
రవీందర్ ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసిబి అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com