ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. సురక్షితంగా ల్యాండ్
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానంలో ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
కాక్పిట్ అద్దంలో సమస్యను గుర్తించిన పైలట్, ముందస్తు భద్రతా చర్యగా విమానాన్ని హైదరాబాద్కు మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఈ సమస్య పరిష్కారం కావడంతో, విమానాన్ని యథాతథంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో, తిరుగు ప్రయాణంలో గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన అదే విమాన సర్వీస్ను ఎయిర్ ఇండియా అధికారులు రద్దు చేసింది. దీంతో 130 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ప్రయాణికులు చాలామంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ రద్దుపై సమాచారం ఆలస్యంగా అందించారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపించారు. ఢిల్లీ నుంచి విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు.
ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీకి చెందిన వారైనప్పటికీ ఈ ఘటనలో ఎలాంటి సహాయం అందలేదని కొందరు విమర్శించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com