హైదరాబాద్: 2బీహెచ్కే ఇళ్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్
హైదరాబాద్ కలెక్టరేట్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అజారుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. 361 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, తాళాలు అందజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పేదలకు వారి ఉపాధి ఉన్న ప్రాంతాలకు దగ్గరలోనే ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రెండు లక్షల పెన్షన్లు త్వరలో విడుదల చేస్తామని, వృద్ధులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ అజారుద్దీన్ తెలిపారు.
ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, సింగిల్ మదర్స్, విడాకులు తీసుకున్న మహిళలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాత బాంబే స్కీమ్ కింద నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, వాటిల్లో ఉండే కుటుంబాలకు తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు.
2బీహెచ్కే భవనాల నిర్వహణకు నిధులు సమకూర్చేందుకు ప్రతి భవనంలో కమర్షియల్ స్థలాన్ని అద్దెకు ఇవ్వాలని ఆయన సూచించారు. వచ్చే నెల అద్దె నుంచి ఆ మొత్తాన్ని భవనాల మెయింటెనెన్స్‌కు వినియోగించుకోవచ్చన్నారు. అలాగే మల్కాజ్‌గిరిలోని ప్రత్యేక పాఠశాలలో ప్రస్తుతం సిబ్బంది లేరని, ప్రభుత్వం ఆ పాఠశాలను దత్తత తీసుకోవాలని కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com