హైదరాబాద్‌లో మేధా భోగీస్ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొండకల్‌లోని మేధా భోగీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.
ఆయనతో పాటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న రైలు భోగీల విడిభాగాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సంస్థ ఉన్నతాధికారులు, కార్మికులతో వైష్ణవ్ సమావేశమయ్యారు.
అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఐటీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామచంద్రరావు ఉన్నారు. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, అన్ని రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు చూపుతోందని ఆయన అన్నారు. సెమీ కండక్టర్లకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారని, సెమీ కండక్టర్ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కేటాయించినట్లు వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ బుల్లెట్ ట్రైన్లకు హబ్‌గా మారుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని వైష్ణవ్ పేర్కొన్నారు. యూపీఐ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు, స్టార్టప్‌ల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోందని ఆయన తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com