హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 11:24 AM
మంగళవారం ఆగస్టు 11 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

భాగ్యనగరంలో బోనాల జాతర వైభవం; తెలంగాణ, ఏపీలో పలు చోట్ల పూజలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భాగ్యనగరంలో బోనాల జాతర వైభవం; తెలంగాణ, ఏపీలో పలు చోట్ల పూజలు
📷 Balaji Srinivasan / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆషాడ మాసం చివరి ఆదివారం భాగ్యనగరం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగ వైభవంగా జరిగింది. భక్తులు తలపై బోనమెత్తుకొని అమ్మవారి ఆలయాలకు తరలివెళ్లారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయాలు మార్మోగాయి.

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి ఆలయంలో బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 118 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఉదయం కుమ్మరి బోనం సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.

గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ గుడిలో భక్తులు ఆరో బోనం సమర్పించారు. అంబర్పేట మహంకాళ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. రహమత్ నగర్ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో కూడా బోనాలు జరిగాయి. కామారెడ్డి జిల్లా బాన్సవాడలో మహిళలు రేణుక ఎల్లమ్మ ఆలయానికి బోనమెత్తుకెళ్లారు. గ్రామ సుభిక్షం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

కడప జిల్లా అరవపల్లిలో శ్రీ ముత్తుమారమ్మ జాతర జరిగింది. భక్తులు అమ్మవారికి అంబలి సమర్పించి గ్రామోత్సవం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా బోరెడ్డి గారి పల్లెలో శ్రీ విరూపాక్షమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. రవాణ శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్వగ్రామమైన ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమరాజు లంకలో శ్రీ లంకాలమ్మ తల్లికి సార మహోత్సవంలో మహిళలు 200 రకాల పండ్లు, స్వీట్లు, చీరలు సమర్పించారు. కొత్తపేట మండలం వానపల్లిలో పల్లాలమ్మ అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com