యూరప్‌లో భానుడి దెబ్బ! ఉష్ణోగ్రతలు 40°C దాటాయి
యూరప్‌లో తీవ్రమైన హీట్ వేవ్ విరుచుకుపడింది. ఫ్రాన్స్‌లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటగా అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. స్పెయిన్‌లో కూడా అనేక ప్రాంతాలలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పోర్చుగల్‌లోనూ ప్రమాదకర వేడి కొనసాగుతుంది.
ఇటలీలో 22 ప్రధాన నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోమ్, మిలాన్, ఫ్లోరెన్స్, బొలోనియా వంటి నగరాలలో ప్రజలు అత్యవసర జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి రావడంతో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలలో AC లు, ఫ్యాన్లు మరియు కూలింగ్ పరికరాల కోసం జనం ఎలక్ట్రానిక్ షాపులకు పరుగులు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో స్టాక్ కొరత కూడా కనిపిస్తుంది.
జర్మనీ, పోలాండ్ వైపు కూడా ఈ హీట్ డోమ్ విస్తరిస్తుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని ప్రాంతాలలో చారిత్రక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. క్రొయేషియా తీర ప్రాంతాలలో రెడ్ వార్నింగ్ అమలులో ఉంది. సెర్బియాలో దాదాపు 39 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆల్బేనియా మరియు బాల్కన్ ప్రాంతాలలో అటవీ మంటలు చెలరేగుతున్నాయి. సైప్రస్, గ్రీస్ ప్రాంతాలలో కూడా వేడి తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది నిరంతరం మంటలను అదుపు చేసే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు.
ఈ హీట్ వేవ్ కారణంగా రోడ్లు కరిగిపోవడం, రైల్వే ట్రాకులు వంగిపోవడం, విద్యుత్ వినియోగం భారీగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పర్యాటక ప్రాంతాలలో సందర్శకులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం యూరప్‌లో అనేక ప్రాంతాలలో సాధారణం కంటే మూడు నుండి పది డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావమే ఈ తీవ్ర హీట్ వేవ్‌కు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలలో ఇలాంటి తీవ్రమైన వేడి గత దశాబ్దాలతో పోలిస్తే మరింత తరుచుగా మరింత తీవ్రంగా వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వేసవిలో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించిన యూరప్ ఇప్పుడు భానుడి దాడితో విలవిలలాడుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com