E20 ఇంధనం బీమా చెల్లుబాటును ప్రభావితం చేయదని కేంద్రం స్పష్టీకరణ
E20 ఇంధనం వాడితే వాహనాల బీమా చెల్లదని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఇంధనం వినియోగానికి, వాహన బీమా చెల్లుబాటుకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీమా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలిపింది.
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం పూర్తిగా సురక్షితమైనదని, వినియోగదారులకు అనుకూలమైనదని కేంద్రం వివరించింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న విధానమని, అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే దీనిని విజయవంతంగా వాడుతున్నాయని పెట్రోలియం శాఖ పేర్కొంది. బ్రెజిల్లో e27 ను ప్రామాణిక ఇంధనంగా వాడుతున్నట్లు గుర్తు చేసింది.
ఈ విధానం వల్ల భారత్కు సుమారు రూ.40 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతుల ఆదాయం కూడా పెరిగిందని వివరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com