వాతావరణం

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక; పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక; పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
📷 Jonathan / Pexels
షేర్ కాపీ అయింది ✓

వాతావరణ శాఖ (IMD) తెలంగాణకు రానున్న 3-4 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 2 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో వాన దంచికొట్టింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో భారీ వర్షం పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎలకతుర్తి మండలాల్లో గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ లోని వరిధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లాలో జిల్లా కేంద్రంతో పాటు తిమ్మాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం, జమ్మికుంట మండలాల్లో వర్షం కురిసింది.

మంచిర్యాల, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షం పడింది. మెదక్ జిల్లా నిజాంపేటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కూడవెల్లి అగ్రహారంలో హనుమాన్ టెంపుల్ సమీపంలో పొలంలో ఈత చెట్టుపై పిడుగు పడింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో గాలివాన కారణంగా పాలవాగు గూడెంలో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కుండపోత వానకు రోడ్లు జలమయమై, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. సిటీలో బంజారా హిల్స్, యూసఫ్గూడా, ఫిలిం నగర్‌లో చిరుజల్లులు పడ్డాయి.

వడగాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసిన రైతులు ఈ వర్షానికి పత్తి గింజలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com