జాతీయం

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలు
📷 Ryan Thomas / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు GHMC కి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు పరిసరాల నుండి ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించి నగరమంతటా పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు చుట్టుపక్కల ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల వల్ల పాదచారులు, న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది.

సీనియర్ సిటిజన్ అయిన బి సురేందర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నగరంలో ఫుట్‌పాత్‌ల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ NV శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.

మే 4న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు GHMC చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. గతంలో పలుమార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి గత ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించడంతో పాటు వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గత నెల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com