వెనిజులా భూకంపాల నేపథ్యంలో 'ఆపరేషన్ అమిస్తాద్' పేరిట భారత్ సాయం
భూకంపాలతో అతలాకుతలమైన వెనిజులాకు భారత్ భారీ మానవతా సాయాన్ని అందిస్తోంది.
'ఆపరేషన్ అమిస్తాద్' పేరుతో కేంద్రం ఈ సాయాన్ని ప్రారంభించింది. వైమానిక దళానికి చెందిన రెండు C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరి రాజధాని కారకాస్‌కు చేరుకున్నాయి. ఇవి రెండు అత్యాధునిక మొబైల్ ఆసుపత్రులు, 35 టన్నుల మందులు, ఇతర వైద్య పరికరాలను తీసుకెళ్లాయి.
కారకాస్‌లోని లా రింకోనాడా అంతర్జాతీయ రేస్ ట్రాక్ వద్ద భారత సైన్యం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ భారత సైనిక వైద్య బృందం ఉచిత వైద్య సేవలందిస్తోంది. వెనిజులా ఉప ఆరోగ్య మంత్రి ఈ శిబిరాన్ని సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు.
భూకంప సంభవించి ఐదు రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి బయటపడే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం లారా ప్రాంతంలో 4.6 తీవ్రతతో మరో ప్రకంపన రావడంతో కారకాస్ ప్రజలు భయాందోళనకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు.
అమెరికా కూడా వెనిజులాకు భారీ సాయం అందిస్తోంది. అమెరికాకు చెందిన 300 మంది రక్షక సిబ్బంది క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు నిర్వహిస్తుండగా, ప్రతిరోజు 24 సైనిక విమానాల ద్వారా సాయం చేరుతోంది. ఇప్పటివరకు 300 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com