కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్, ప్లైవుడ్ పరిశ్రమలకు మంటలు
రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ రా మెటీరియల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు కూడా అంటుకున్నాయి. దీంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన మైలార్దేవి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంటలు పక్క పరిశ్రమలకు, నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాళ దీపావళి పండుగ కావడంతో ఉదయం, సాయంత్రం టపాసులు వెలిసే పరిస్థితి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మరి కొన్ని గంటల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారులు చెప్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com