వానకాలం అపరాల సాగు: కంది, పెసర, మినుముకు అనుకూలమైన రకాలు ఏవి?
వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు ప్రకారం, ఖరీఫ్ సీజన్‌లో అపరాల విత్తుకోవడానికి జూన్ 15 నుంచి జూలై 15 వరకు అనుకూలమైన సమయం. వర్షాలు ఆలస్యమైతే ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. ఆగస్టులో విత్తినప్పుడు సాళ్ల మధ్య దూరం తగ్గించి, విత్తన మోతాదు పెంచాలి.
కంది పంటకు ఎకరానికి 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. పెసర, మినుముకు ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో నీరు నిలబడకుండా ఉండేందుకు బోదె కాలువలు చేసి ఆ బోదెల మీద విత్తనం వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంది రకాలు: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విడుదల చేసిన రకాల్లో DRJE 97 (వరంగల్ కంది 1), DRG 93 (తెలంగాణ కంది 1), DRG 121 (తెలంగాణ కంది 2), RG 255 (వరంగల్ కంది 2) ఉన్నాయి. ఇవన్నీ ఎండు తెగులు తట్టుకొని ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి. DRJE 97 పత్తిలో అంతర పంటకు, ఎర్ర చెలక నేలలకు అనుకూలం. DRG 93 నల్ల రేగడి నేలలకు అనుకూలం.
తాండూర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన TDRG హనుమాన్ రకం వర్షాకాలం మరియు యాసంగిలో కూడా వేసుకోవచ్చు. ఇది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. TDRG 59, TDRG 272 రకాలు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి. పాలెం నుంచి విడుదలైన PRG 176 ఉజ్వల రకం 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి, తక్కువ వర్షపాతం ఉన్న ఎర్ర చెలక నేలలకు అనుకూలం. ఆశ, మారుతి, మన్నంకొండ రకాలు కూడా అనుకూలమైనవే.
పెసర రకాలు: వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన G 42 యాదాద్రి రకం 58 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పత్తిలో అంతర పంటకు కూడా అనుకూలం. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. WG 37 ఏకచిల రకం పల్లాకు తెగులు తట్టుకొని 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మధిర పరిశోధన స్థానం నుంచి MGJ 385 రకం కూడా 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 347, 357, మధిర 357 రకాలు కూడా అనుకూలమైనవి.
మినుము రకాలు: మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైన మదిర బ్లాక్ గ్రామ్ 1075, 1085 రకాలు కొత్తగా వచ్చిన రకాలు. PU 31 రకం పల్లాకు తెగులు తట్టుకొని ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. TBG 104 రకం 70 నుంచి 75 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. GBGO రకం కూడా ఎన్నుకోవచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com