ఏపీలో విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత: హెల్త్ ఇండెక్స్‌తో ట్రాన్స్‌ఫార్మర్ల పర్యవేక్షణ
విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో సాంకేతికత కీలకంగా మారనుంది. సబ్ స్టేషన్లలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల జీవిత కాలాన్ని హెల్త్ ఇండెక్స్ సాంకేతికతతో అంచనా వేయబోతున్నారు. విజయవాడ విద్యుత్ సౌధంలో స్టేట్ ట్రాన్స్‌మిషన్ అసెట్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర పరికరాల్లోని సమస్యలను ముందే గుర్తించి సరిదిద్దనున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, లైట్నింగ్ అరెస్టర్లు, ఐసోలేటర్లు, బస్ బార్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు వంటి విలువైన పరికరాలు ఉంటాయి. ప్రస్తుతం వాటి పనితీరును సిబ్బంది ఆఫ్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే తప్ప పరికరాల అంతర్గత పరిస్థితి తెలిసే అవకాశం ఉండదు.
ఈ సమస్యను అధిగమించేందుకు హెల్త్ ఇండెక్స్ సాంకేతికతను ట్రాన్స్కో వినియోగించనుంది. పరికరాల అంతర్గత సామర్థ్యాన్ని హెల్త్ ఇండెక్స్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ట్రాన్స్‌ఫార్మర్ ప్రస్తుత స్థితి ఏమిటి, దాని జీవితకాలం ఎంత మేరా క్షీణించింది, ఎన్ని రోజుల్లో దెబ్బ తినే అవకాశం ఉందనే సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ట్రాన్స్‌ఫార్మర్లను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తారు. IoT సెన్సార్లు, SCADA ఇంటిగ్రేషన్, థర్మల్ ఇమేజెస్, డ్రోన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ల ద్వారా సేకరించిన డేటాను క్రోడీకరించి పరికరాల జీవితకాలాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా ట్రాన్స్‌ఫార్మర్ జీవితకాలం 35 ఏళ్ల వరకు ఉంటుంది.
ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించి ఆయిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెయింటెనెన్స్ సమాచారం డేటా అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. కొత్త సాంకేతికతతో విద్యుత్ అంతరాయాల సమయంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. హెల్త్ ఇండెక్స్ ప్రోగ్రామును ట్రాన్స్కో ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com