ఉల్లి పంటకు ఎరువులు, నీటి యాజమాన్యం: ఎకరాకు ఎంత వేయాలంటే?
ఉల్లి పంటలో నాణ్యమైన, అధిక దిగుబడి రావాలంటే ఎరువులు, నీటి తడులు సరైన సమయంలో అందించాలి. ఈ పంట సేంద్రీయ ఎరువులకు బాగా స్పందిస్తుంది.
కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు అధికంగా జరుగుతోంది. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కొంత మేర సాగు ఉంది. ఖరీఫ్, రబీ, వేసవి అన్ని కాలాల్లోనూ ఉల్లి సాగు చేయొచ్చు. అయితే రబీ పంటలో దిగుబడి, గడ్డ నాణ్యత ఎక్కువగా ఉంటాయి. నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ ఉల్లి సాగు కొనసాగుతుంది. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల పంటకాలంలో ఎకరాకు 100 నుంచి 130 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు ఈ పంటకు అనుకూలం.
ప్రస్తుతం పంట ఎదుగుదల దశ నుంచి గడ్డ ఊరే దశ వరకు వివిధ దశల్లో ఉంది. చాలా ప్రాంతాల్లో నారు నాటడం పూర్తయింది. ఆలస్యమైన ప్రాంతాల్లో రైతులు వేసవి పంటగా ప్రధాన పొలంలో నాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ పంట ఏప్రిల్ వరకు కొనసాగుతుంది.
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దీనితో పాటు 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 నుంచి 32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అందించాలి. నత్రజని, పొటాష్‌ను రెండు దఫాలుగా వేయాలి. నాటినప్పుడు ఒక దఫా, నాటిన 30 రోజుల తర్వాత మరో దఫా వేయాలి. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం లేదా ఫాస్ఫో బాక్టీరియాను ఎకరాకు 2 కిలోల చొప్పున వాడొచ్చు. హెక్టారుకు 20 నుంచి 25 కిలోల సల్ఫర్‌ను చివరి దశలో వేస్తే గడ్డ ఘాటు పెరుగుతుంది.
నీటి తడుల విషయంలోనూ జాగ్రత్త అవసరం. నాటిన 60 రోజుల వరకు 12 నుంచి 15 రోజుల వ్యవధిలో నాలుగైదు తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6 నుంచి 7 రోజుల వ్యవధిలో ఏడెనిమిది తడులు అందించాలి. కోతకు 15 రోజుల ముందు నీరు పెట్టడం ఆపాలి. తేలికపాటి నేలల్లో తడులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com