విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది
విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. పూజారి వెంకట్రావు సిరిమాను అధిరోహించారు.
తుఫాను ప్రభావంతో జోరున వర్షం కురుస్తున్నా భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమాను ఊరేగింపు జరిగింది. ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ఊరేగింపుగా సాగాయి. కోటలో దుర్గామాత వద్ద సిరిమాను మూడుసార్లు తిరిగిన తర్వాత ఆలయానికి చేరింది.
జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తొలేళ్ళ ఉత్సవం జరిగింది. దీంతో జిల్లా కేంద్రం కిక్కిరిసింది. లక్షలాది భక్తులతో ఆలయం, ప్రధాన కూడళ్లు, వీధులు కిటకిటలాడాయి.
గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com