బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్లు కొట్టివేత
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయించిన భూములు మరియు నీటి కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన GO లను సవాలు చేస్తూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 2012, 2013 సంవత్సరాలలో దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల కొట్టేసింది.
పిటిషనర్ సంస్థ తరపున విచారణకు ఎవరూ హాజరు కాలేదని, దీన్ని బట్టి వాదనను వినిపించేందుకు ఆసక్తి కనపరచడం లేదని హైకోర్టు పేర్కొంది. వ్యాజ్యాలను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు జూన్ 25న ఉత్తర్వులు జారీ చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో స్టీల్ ప్లాంట్ మరియు విమానాశ్రయ నిర్మాణం కోసం కేటాయించిన భూములను రద్దు చేస్తూ 2013లో ప్రభుత్వం GO జారీ చేసింది. గండికోట మైలవరం రిజర్వాయర్ల నుంచి స్టీల్ ప్లాంట్‌కు నీటి కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 2012లో GO జారీ చేసింది.
ఈ GO లను రద్దు చేయాలని కోరుతూ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అదనపు డైరెక్టర్ 2012, 2013లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి ఈ ఏడాది జూన్ 17, 23 తేదీలలో హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ సంస్థ తరపున ఎవరూ హాజరు కాలేదు. మరో అవకాశం ఇస్తూ వ్యాజ్యాలను హైకోర్టు జూన్ 25కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా విచారణకు ఎవరూ హాజరు కాలేదు. ఫలితంగా డిఫాల్ట్‌గా పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com