హైదరాబాద్: శ్రీ సాయి దర్శన్ రెసిడెన్సీ నివాసితుల భద్రతా ఆందోళనలు; అక్రమ హోటల్ కార్యకలాపాలపై ఆరోపణలు
హైదరాబాద్ లోని అమీర్‌పేట్ శ్రీ సాయి దర్శన్ రెసిడెన్సీ నివాసితులు తీవ్ర భద్రతా సమస్యలతో సతమతమవుతున్నారు. తమ అపార్ట్‌మెంట్ కింది భాగంలో నిర్వహిస్తున్న హోటల్ కార్యకలాపాల వల్ల భవనం, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు భవనంలో పదేళ్ల కిందట ఒక వ్యక్తి కొన్ని షట్టర్‌లను కొనుగోలు చేసి, వాటిని హోటల్ నిర్వాహకులకు లీజుకు ఇచ్చారు. ఆ హోటల్ నుంచి వంటల వేడి, పొగ, శబ్దం నేరుగా లీక్‌అవుతున్నాయి. అంతేకాకుండా, హోటల్ వంటగది చిమ్నీని అపార్ట్‌మెంట్ కారిడార్‌లో, నాలుగో అంతస్తు వరకు ఏర్పాటు చేశారు. దాని వల్ల వెలువడే పొగ, శబ్దం వల్ల ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధపడే వృద్ధులు, మహిళలు ప్రతి క్షణం ఇబ్బంది పడుతున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఇనుప రేకులు, ప్లాస్టిక్ డబ్బాలు పేర్చడంతో ఇటీవల మైత్రివనంలో జరిగిన తరహా అగ్ని ప్రమాదం పునరావృతమయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఆరేళ్ల కిందట కూడా హోటల్ కారణంగా చిన్న మంటలు చెలరేగినా, అప్పటి నుంచి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెబుతున్నారు. హోటల్ డ్రైనేజీ లీకేజీతో బోర్వెల్ నీరు కలుషితం కావడంతో, తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిందని, ఈ క్రమంలో గత దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల వరకు అదనపు ఖర్చు చేశామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
క్షణంలో జరిగే అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేదని, ప్రస్తుతం చిన్న స్పార్కింగ్ వచ్చినా పెద్ద ప్రమాదం జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. సమస్యపై పలుమార్లు జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్‌లకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. దీంతో తాజాగా హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించాలని నిర్ణయించారు. అక్రమ నిర్మాణాలు, చిమ్నీ, డ్రైనేజీ లైన్ల తొలగింపు, భవన భద్రతపై సమగ్ర తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హోటల్ నిర్వాహకుడు సత్యనారాయణ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com