తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ‘ఈగల్ ఫోర్స్’ ఏర్పాటు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఈగల్ ఫోర్స్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో అమ్మటానికి వీలు లేదని, అసలు వ్యాపారం అనే పదమే వినబడకూడదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక్కరు కూడా మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదని, యువత ఆరోగ్యవంతంగా ఉండేలా చూడటమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క వివరించారు.
‘‘పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. ఆ భవిష్యత్తుకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే, ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు’’ అని ఆయన హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నార్కోటిక్ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సాయం, వాహనాలు అందించామని తెలిపారు.
ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పని చేసేందుకు అన్ని వనరులు కేటాయించామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com