తెలంగాణ

తెలంగాణలో రూ.21 వేల కోట్ల రుణ సేకరణ; రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలకు నిధులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో రూ.21 వేల కోట్ల రుణ సేకరణ; రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలకు నిధులు
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడు నెలల్లో రూ.21 వేల కోట్ల కొత్త రుణాలు సమీకరించాలని నిర్ణయించింది. ఆర్థిక అవసరాల కోసం బాండ్ల వేలం విధానంలో విడతల వారీగా ఈ మొత్తాన్ని సేకరించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం ఈ వివరాలు తెలియజేసింది.

వచ్చే నెలలో ఒకే విడతలో రూ.7 వేల కోట్లు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఒక్కో విడతలో రూ.2 వేల నుంచి 3 వేల కోట్ల వరకు రుణాలు తీసుకుంటారు. అయితే ఈసారి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం గమనార్హం.

రైతు భరోసా పథకం, ఉద్యోగుల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుల కోసమే ఈ రుణాలు సమీకరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద ఈ నెల 30న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి 9 వేల కోట్ల రూపాయలు అవసరం. ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నెలకు రూ.700 కోట్లు గత జులై నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. రిటైరైన ఉద్యోగుల పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిల కింద రూ.6 వేల కోట్లను 100 రోజుల్లోగా ఇవ్వనున్నట్లు గత నెలలో ప్రకటించారు. దీనిలో నెలకు రూ.2 వేల కోట్లు చొప్పున అందిస్తారు. జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.5,500 కోట్ల అవసరం ఉంది.

ఈ బాండ్ల వేలానికి సంబంధించి తీసుకున్న రుణాన్ని 10 నుంచి 30 సంవత్సరాల్లో తిరిగి చెల్లిస్తామని రాష్ట్రం ఆర్బీఐకి తెలిపింది. దేశవ్యాప్తంగా తెలంగాణతో సహా 18 రాష్ట్రాలు వచ్చే మూడు నెలల్లో రూ.3.18 లక్షల కోట్ల రుణాలు సమీకరించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్) తొమ్మిది రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేసిన బెంచ్మార్క్ ఇష్యూన్స్ స్ట్రాటజీ (BIS) విధానాన్ని రెండో త్రైమాసికంలో 18 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. పారదర్శకత కోసం మూడు నెలల ముందే ఎంత రుణం, ఎంత వడ్డీతో సేకరిస్తారనేది తెలియజేయాలనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com