పోలవరంలో పెద్దపులి అడుగుజాడలు – అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక
ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎన్ఎన్టి పేట సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. చెరువుగట్టు నుంచి దానవైకొండ, ఒంటికొండ వైపు పులి వెళ్లినట్లు స్థానికులు ఉదయం పాదముద్రలు గుర్తించారు. గిరిజన ప్రాంత ప్రజలు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ జాడలు కనిపించాయి. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు పెద్దపులివిగా నిర్ధారించారు.
ఈ పులి గతంలో రాజమండ్రి ప్రాంతంలో సంచరించిన సమయంలో పట్టుకుని, అటవీ ప్రాంతంలోకి వదిలే ముందు రేడియో ట్యాగింగ్ అమర్చారు. అయితే గత 15 రోజులుగా పులి జాడ ఎక్కడా కనిపించలేదు. తాజాగా రేడియో సంకేతాలు పొలవరం ప్రాంతంలో కదలికలను నమోదు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పులి సంచారం నేపథ్యంలో గ్రామస్థులకు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రివేళల్లో ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, అడవి సరిహద్దు ప్రాంతాల్లో ఆవులు, మేకలు వంటి పశువులను కట్టివేయవద్దని సూచించారు. పులి అటవీ ప్రాంత సరిహద్దుల్లోనే తిరుగుతున్నందున అప్రమత్తత అవసరమని తెలిపారు.
పులిని పోలవరం వన్యప్రాణి అటవీ ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com