ఏసీబీ దాడులు: నరహరి బ్యాంకు లాకర్‌లో రూ.1.5 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్‌లోని సాలిబండ కెనరా బ్యాంకులో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు బద్దలు కొట్టి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక లాకర్ నుంచి రూ.1.50 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నరహరి కుటుంబ సభ్యులు లాకర్ తాళాలు అందించేందుకు సహకరించకపోవడంతో, న్యాయస్థానం అనుమతితో ఏసీబీ లాకర్లను తెరిచింది. ఇదే కేసులో గతంలో నరహరి ఇంట్లో జరిపిన సోదాల్లో బెడ్రూమ్‌లోని బీరువా పైన కబ్బోర్డ్ నుంచి రూ.1.54 కోట్ల నగదు, 1.3 కిలోల బంగారం బయటపడింది. నరహరి బ్యాంకు ఖాతాలో రూ.2.29 కోట్ల నిల్వ, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు 8 కిలోల వెండిని ఏసీబీ గుర్తించింది. ఆయన బ్యాంకు అకౌంట్‌లో మరో రూ.5 కోట్లు ఫ్రీజ్ చేశారు.
ఆస్తుల వివరాలను పరిశీలిస్తే, నరహరికి చత్రినాకలో ఇల్లు, గచ్చిబౌలిలో టీఎన్జీఓ కాలనీలో భవనం, రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, ఉప్పాలగూడలో హైరైజ్డ్ బిల్డింగ్, నార్సంగిలో రెండు హైరైజ్డ్ బిల్డింగ్స్, రాజేంద్రనగర్‌లో రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నట్టు దాడుల్లో బయటపడింది. సైబరాబాద్‌లో భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు, ఆస్ట్రేలియాలో కుమారుడు, అత్తమామల పేరిట రిజిస్టర్ చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.180 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
నరహరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటివరకు ఏసీబీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. నరహరి 2013 వరకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్‌గా, 2016 నుంచి 2020 వరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో విధులు నిర్వహించారు. నిరుడు ఆగస్టులో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వేల్లో అవినీతి ఆరోపణలు నరహరిపై ఉన్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com