కాకినాడలో వరి పంట నీట మునిగింది: తుఫానుతో రైతులకు భారీ నష్టం
కాకినాడ జిల్లాలో తుఫాను, ఈదురుగాలుల ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట నీట మునిగింది. ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద నీరు రోడ్లపైకి పొంగి పొలాల్లోకి చేరుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
దీపావళి తర్వాత వరి కోతలు మొదలవ్వాల్సి ఉంది. అదే సమయంలో రెండు రోజుల పాటు అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో పంట పొలాల్లో నేలకు వాలిపోయింది. వరి గుబ్బలు నీటిలో నాని కుళ్లిపోతుండడంతో దిగుబడి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
ఎకరాకు సుమారు ₹30,000 పెట్టుబడి పెట్టామని రైతులు చెప్తున్నారు. కోత మిషన్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి ఉందంటున్నారు. కౌలు రైతులకు ఇబ్బంది మరింత ఎక్కువ. పంట పండినా, పండకపోయినా భూ యజమానికి సిస్తు చెల్లించాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు.
గతంలో కరువు పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు తుఫానుతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఏలేరు ప్రాజెక్ట్ నుంచి వరద నీరు ఇంకా పొలాల్లోకి వస్తూనే ఉందని రైతులు చెప్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com