హైదరాబాద్ 27°C
అమరావతి 29°C
IST 10:17 AM
గురువారం అక్టోబర్ 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

నిజామాబాద్ రైస్ మిల్లర్ల కుంభకోణం: 70 మంది అజ్ఞాతంలోకి, CID దాడులతో హడలెత్తిన మిల్లర్లు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నిజామాబాద్ రైస్ మిల్లర్ల కుంభకోణం: 70 మంది అజ్ఞాతంలోకి, CID దాడులతో హడలెత్తిన మిల్లర్లు
📷 RDNE Stock project / Pexels
షేర్ కాపీ అయింది ✓

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్ళించిన రైస్ మిల్లర్లపై CID అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. అధికారుల దూకుడుకు భయపడిన మిల్లర్లు సుమారు 70 మందికి పైగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, మిల్లులకు తాళాలు వేసి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు.

రైస్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మేసి, సన్నాలకు బదులు దొడ్డు రకం బియ్యాన్ని భారత ఆహార సంస్థ అంటే FCI కి అంటకట్టారు. అధికారులు కొందరు మిల్లర్లతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. ఈ మోసాన్ని గుర్తించిన ప్రభుత్వం CID విచారణకు ఆదేశించింది.

CID అధికారులు ముకుంద కృష్ణ, అన్నపూర్ణ, వెంకటేశ్వర ఆగ్రో, శ్రావణి ట్రేడింగ్, భువి ఆగ్రో ఇండస్ట్రీస్, పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్ లో తనికీలు నిర్వహించారు. ఈ ఆరు మిల్లల్లో 667 మెట్రిక్ టన్ల సన్నాలకు బదులు దొడ్డు బియ్యం FCI కి ఇచ్చినట్లు గుర్తించారు. సుమారు 10 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చారు.

ఇప్పటికే శ్రావణి ట్రేడింగ్ యజమాని రమణయ్య, భువి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని లాబిశెట్టి శ్రీకాంత్, పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని లాబిశెట్టి గంగప్రసాద్ లను అరెస్ట్ చేశారు. అయితే ముకుంద కృష్ణ యజమాని సూర్యనారాయణ, అన్నపూర్ణ ఆగ్రో యజమాని అనూష, వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీ మిల్లర్ తోకల అంజయ్య ఆచూకి దొరకలేదు. వారి కోసం CID అధికారులు గాలిస్తున్నారు.

దొడ్డు బియ్యం పాస్ అయ్యేందుకు సహకరించిన వారిని గుర్తించేందుకు ఇప్పటికే అరెస్ట్ అయిన మిల్లర్లను కస్టడీకి తీసుకొని ఇంటరాగేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్ లో 15 లక్షల క్వింటాల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల చొప్పున బియ్యాన్ని మిల్లింగ్ రూపంలో ప్రభుత్వానికి తిరిగివ్వాలి. ఒక్కో మిల్లు 60 నుంచి 100 లారీల బియ్యం సన్నాలకు బదులు దొడ్డు రకం ఇచ్చింది. ఒక్కో లారీ వెనుక మూడు నుంచి అయిదు లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి సూత్రధారులను శిక్షించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com