సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో SIT దర్యాప్తు వేగం పెంచింది
సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో SIT వేగం పెంచింది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను అధికారికంగా ప్రారంభించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రికార్డులు మరియు సాక్ష్యాలను SIT అధికారులు పరిశీలించారు. సాయి కృష్ణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే SIT అధికారులు విచారణ చేపట్టారు. SIT బృందంలో సభ్యుడిగా ఉన్న బాపట్ల జిల్లా అదనపు SP సుధాకర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. SIT కంటే ముందే విజయవాడ CP రాజశేఖర్ బాబు దిశ ACP దైవప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ మూడు రోజుల పాటు సేకరించిన సమాచారాన్ని SIT కు సమర్పించారు.
ఫోరెన్సిక్ బృందాలు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కోణంలో విచారణ సాగించాయి. SIT విచారణ అధికారి IG రవిప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. SIT సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా SP అమిత్ బర్దర్ మరియు బాపట్ల జిల్లా అదనపు SP సుధాకర్ సాయి కృష్ణ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
సోమవారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విచారణ నిర్వహించారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామలు ముళ్ళపూడి నాగేశ్వరరావు, ముళ్ళపూడి నవరంగులతో పాటు సాయి కృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గతో SIT బృందం మాట్లాడింది.
మే 9 నుంచి సాయి కృష్ణ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. CI నాగరాజు తమ కుమారుణ్ణి కొట్టి చంపి దహనం చేశాడని, ఇందులో CI తో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ పాత్ర ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాలతో తీసుకొచ్చారనే వివరాలు SIT అధికారులు అన్వేషిస్తున్నారు. కాల్ డేటా మరియు టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారనున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com