తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు; రైతులకు కీలక సూచనలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం తెలంగాణలో రాబోయే 5 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 30-37°C, రాత్రి 24-29°C మధ్య నమోదవుతాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించి జూన్ 23 నాటికి పూర్తిగా విస్తరించాయి.
జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు ఈ వాతావరణం నేపథ్యంలో పలు సూచనలు జారీ చేసింది. వర్షాధార పంటలు విత్తేటప్పుడు మట్టి 15-20 సెం.మీ. లోతు తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తాలి. వాలుకు అడ్డంగా, బోదెలు కాలువల పద్ధతిలో లేదా ఎత్తు మడుల పద్ధతిలో విత్తుకోవాలి.
చెరువులు, కుంటలకు దూరంగా ఉండే తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరం ఉండే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఇప్పటికే పంటలు విత్తిన రైతులు పొలాల్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
టమాట, వంగ, బెండ, మిరప, ఆకుకూరలు వంటి కూరగాయలు కోతకు సిద్ధంగా ఉంటే వాటిని కోయాలి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను కూడా చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, తీగలు, నీటి కుంటలు, చెరువులకు దూరంగా ఉండాలి.
వరి సాగు చేసే రైతులకు: ప్రస్తుతం పచ్చిరొట్ట పైరుగా జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, ఉలవలు, అలసంద పంటలు విత్తుకోవడానికి అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్ళు పోసుకోవడానికి ఇది మంచి సమయం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 వరి విత్తనాన్ని మాత్రం జూలై మొదటి వారంలో మాత్రమే నారుమడి పోసుకోవాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com