మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.7,345 కోట్ల కేటాయింపు
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ మేరకు వెల్లడైంది.
ఈ ప్రాజెక్టు కోసం రూ.7,345.12 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.4,500 కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణంగా, రూ.2,845 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటుగా సమకూరుతాయి. హెచ్ఎండీఏ, టీజీఐ నిధుల నుంచి గ్రాంటు ఇవ్వనుంది.
మొదటి దశలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఈ పనులను ఈపీసీ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పనులు రెండు జోన్లుగా విభజించారు. జోన్ 1ఏ కింద హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపు ఘాట్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని రూ.3,232 కోట్లతో అభివృద్ధి చేస్తారు. జోన్ 1బీ కింద ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల ప్రాంతాన్ని రూ.4,113 కోట్లతో నదీ తీరంగా మారుస్తారు. ఈ రెండు జోన్ల పనుల అంచనా వ్యయం రూ.7,054 కోట్లు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చు రూ.291 కోట్లతో కలిపి మొత్తం రూ.7,345.12 కోట్లు అవుతుంది.
భూసేకరణ ఖర్చులు కాకుండా కేవలం భౌతిక నిర్మాణ పనులకే ఈ నిధులు వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రాజెక్టు నాణ్యత, పారదర్శకత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని నియమిస్తారు. టెండర్ల ప్రక్రియ ఏడీబీ నిర్దేశించిన ప్రొక్యూర్మెంట్ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ధి, రవాణా వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com