భూటాన్‌లో హిమానీనద సరస్సు విస్ఫోటం: అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో హై అలర్ట్
భూటాన్ దేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారీ హిమానీనద సరస్సు బద్దలైంది. వాయువ్య భూటాన్‌లోని గాసా జిల్లాలోని షింటాపు సరస్సు ఉప్పొంగడంతో భారీ వరద సంభవించింది. దీంతో భారత్ వైపు భారీగా వరదలు దూసుకొస్తున్నాయి. అస్సాం మరియు పశ్చిమ బెంగాల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది.
సంకోష్ నది మరియు దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. భూటాన్‌లో సరస్సు బద్దలవ్వడంతో భారీగా విడుదలైన నీరు మరికొన్ని గంటల్లో మైదాన ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. NDRF కు సమాచారం అందించారు. విపత్తు నిర్వహణ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు మరియు ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
గాసా జిల్లాలోని మోచు నది పరివాహక ప్రాంతంలో ఉన్న వేడినీటి బుగ్గ గాసా వద్ద ఉన్న సౌకర్యాలు కొట్టుకుపోయాయి. అయితే ముందుగానే అక్కడి ప్రజలను ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రస్తుతం వరద నీరు దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తోంది. శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటింది.
దీంతో అస్సాంలోని దుబ్రి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపూర్‌దువార్, జల్‌పాయిగూరి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉంది. భూటాన్ ఇప్పటికే ఈ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సంకోష్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు పశ్చిమ బెంగాల్‌లోని కోచ్‌బెహర్ స్థానిక యంత్రాంగం అలర్ట్ చేసింది.
హిమాలయాల్లో ఉన్న పదిహేడు ప్రమాదకర హిమానీనద సరస్సుల్లో షింటాపు కూడా ఒకటి. మోచు నది ప్రారంభమయ్యే చోట ఈ సరస్సు ఉంది. 2021లో మోచు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో గాసా వేడినీటి బుగ్గ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నీ కొట్టుకుపోయాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com