వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో VBG రామ్‌జీ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల పేదలకు 125 రోజుల ఉపాధిని ఈ పథకం హామీ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తారు.
ఈ పథకానికి మొత్తం 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఎం తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 7,700 కోట్లు కాగా, రాష్ట్రం 4,000 కోట్లు భరిస్తుందన్నారు. మునుపటి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో అవకతవకలు చేసిందని ఆరోపించారు. పని జరగకపోయినా తప్పుడు లెక్కలు రాశారన్నారు. ఇకపై డిజిటల్ మాస్టర్ రోల్స్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, రియల్ టైం మానిటరింగ్, జియో ట్యాగింగ్ తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయ కాలంలో 60 రోజులు కలిపితే సంవత్సరానికి 185 రోజులు పని దొరుకుతుందని వివరించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి చక్కగా సహకరిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు వచ్చాయని, దేశంలో రెండో స్థానం సాధించిందని సీఎం అభినందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com