పని ఇప్పిస్తానని నమ్మించి మహిళపై దాడి; బంగారం దోచుకుని బావిలోకి తోసిన నిందితుడు
కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తిమ్మాపూర్ మండలం నస్తులాపూర్‌లో పని ఇప్పిస్తానని నమ్మించి, ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని బావిలోకి నెట్టాడు.
24 గంటల పాటు బావిలోనే ఉన్న లక్ష్మీ ఈత కొట్టుకుంటూ ప్రాణాలు కాపాడుకుంది. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమె అరుపులు ఎవరూ వినలేదు. చివరకు స్థానిక రైతులు ఆమెను గుర్తించి బావి నుంచి బయటకు తీశారు.
లక్ష్మీ కుమారుల ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితురాలి మొబైల్ ఫోన్ సిగ్నల్ నస్తులాపూర్‌లో ఉన్నట్లు గుర్తించి, లొకేషన్ ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రైతులు అప్పటికే ఆమెను రక్షించారు.
నిందితుడు లక్ష్మీని రాపిడో బుక్ చేసి నస్తులాపూర్ పంపించినట్లు పోలీసులు గుర్తించారు. తాను వేరే బైక్‌పై అక్కడికి వచ్చి, రైతు వేదిక సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com