ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మంచాలలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' (TPS) ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పాఠశాలను పైలట్ ప్రాజెక్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది.
తెలంగాణ విద్యా కమిషన్ సూచనల మేరకు ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్న శివారెడ్డి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు.
పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించే లక్ష్యం. డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లు, డైనింగ్ హాల్స్, విశాలమైన ప్లేగ్రౌండ్స్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ వంటి ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలు, శిక్షకులు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
విద్యార్థుల కోసం ఐదు స్కూల్ బస్సులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేశారు. బోధన మాధ్యమంగా ఇంగ్లీషును ఎంచుకున్నారు.
మొదటి దశ పైలట్‌గా రాష్ట్రంలో నాలుగు పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. రంగారెడ్డిలో ఆరుట్ల మంచాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఎంపికయ్యాయి.
ప్రస్తుతం ఆరుట్ల పాఠశాలలో 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ 150, ప్రైమరీ 600, హైస్కూల్ 800, ఇంటర్ మొదటి సంవత్సరం 160, రెండో సంవత్సరం 104 మంది ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల పైలాన్ను ఆవిష్కరించిన తర్వాత తరగతి గదులు, ల్యాబ్‌లు, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలు పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com