సంక్షేమ పథకాల అమలుకు AI వాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు నేరుగా చేర్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎంసీ హెచ్ఆర్డీ బోదీ పెవిలియన్‌లో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ మాట చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏఐ సాంకేతికతను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT)తో అనుసంధానిస్తే అవినీతికి చెక్ పెట్టవచ్చని, అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం దక్కుతుందని వివరించారు. అలాగే రాష్ట్ర ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ లీకేజీలను అరికట్టేందుకు ప్రతి శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని, కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖల్లో లీకేజీలు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఆ సెల్ పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేరేలా పారదర్శక విధానాలు అనుసరించాల్సిందేనని చెప్పారు.
భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, అభివృద్ధి ప్రాజెక్టుల అడ్డంకులు తొలగించాలని, పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. రాబడి లక్ష్యాల విషయంలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, హెచ్ఎండీఏ, టీజీఐసీ వంటి కీలక సంస్థలు తమ లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలను వాస్తవికత ఆధారంగానే రూపొందించాలని నిర్దేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com